మహేష్ బాబుకు బ్యానర్ ఉంది. కొంత రెమ్యూనరేషన్ గా తీసుకొని, ఇంకొంత నిర్మాణ భాగస్వామిగా వెనకేసుకుంటాడు. అటు చిరంజీవికి కూడా బ్యానర్ ఉంది. మెగాస్టార్ కూడా మహేష్ లానే చేస్తారు. తాజాగా రవితేజ కూడా బ్యానర్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ కూడా అదే వ్యవహారం. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్. ఎవరూ కాదనలేని నిజాలు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఎన్టీఆర్ కూడా చేరబోతున్నాడా?
ఎన్టీఆర్ బ్యానర్ పెట్టడం లేదు. తన కుటుంబంలోనే ఉన్న బ్యానర్ తో అసోసియేట్ అవుతున్నాడు. అదే ఎన్టీఆర్ ఆర్ట్స్. కల్యాణ్ రామ్ స్థాపించిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ ను ఇకపై తన సినిమాలకు ఎటాచ్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. అంటే.. తారక్ కూడా మహేష్, చిరంజీవిలా రెమ్యూనరేషన్ విషయంలో మారిపోయాడన్నమాట.
ఈ విషయాన్ని స్వయంగా కల్యాణ్ రామ్ కన్ ఫర్మ్ చేశాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న తారక్-కొరటాల సినిమాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎటాచ్ అయింది. ఆ తర్వాత తారక్ చేయబోయే ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంటుందని కల్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, ఇకపై ఎన్టీఆర్ సినిమాలన్నింటికీ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు కల్యాణ్ రామ్.
ఇన్నాళ్లూ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కల్యాణ్ రామ్ మాత్రమే సినిమాలు చేశాడు. నిర్మించాడు, నటించాడు. ఇకపై ఈ బ్యానర్ లో తనతో పాటు ఎన్టీఆర్, బాలకృష్ణ కూడా నటిస్తాడని చెబుతున్నాడు.