తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ తెల్లవారుజామునే జానియర్ ఎన్టీఆర్, కల్యాణరామ్ లు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు..పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను స్మరించుకున్నారు.
ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న బాలకృష్ణ తన తండ్రి సమాధి వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన చేసి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారని బాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీని స్థాపించి ప్రతి తెలుగు బిడ్డకు ఆత్మవిశ్వాసం కల్పించారని తెలిపారు.
ఎంతో మందికి రాజకీయ ఓనమాలు నేర్పారన్న ఆయన..ఎన్టీఆర్ ఓ పొలిటికల్ హీరో అని వ్యాఖ్యానించారు. పేదవాడి ఆకలి తీర్చిన అమ్మ, ఆడవారికి అండగా నిలిచిన అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. టీడీపి అనేది రాజకీయ పార్టీ కాదని..ఒక వ్యవస్థ అన్న బాలకృష్ణ..పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.
టీటీడీపీ అధ్యక్షుడు,పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలుగు మహిళ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవ చిరస్మరణీయమని కాసాని పేర్కొన్నారు. వర్థంతి కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. వీరితో పాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.