ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. జూన్ నుంచి సెట్స్ పైకి వస్తుందని తాజాగా కొరటాల క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ వైపు నుంచి ఆలోచిస్తే, జులై వరకు ఈ సినిమా సెట్స్ పైకొచ్చేది అనుమానమే. ఈ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడీ సినిమాకు భారీ మార్పుచేర్పులు చేయబోతున్నారు. కథలో కొన్ని సన్నివేశాలతో పాటు, హీరోయిన్, టెక్నీషియన్స్ ఇలా చాలామంది మారబోతున్నారు. దీనికి ఓ కారణం ఉంది.
ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా అనిపించుకుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 పెద్ద హిట్టయింది. నార్త్ లో సౌత్ సినిమాల స్టామినా ఏంటో టాలీవుడ్ జనాలకు బాగా తెలిసొచ్చింది. దీంతో పాన్ ఇండియా అప్పీల్ ఇవ్వాలంటే సినిమాకు ఇంకా ఏమేం కావాలో కొరటాల లాంటి దర్శకుడికి, ఎన్టీఆర్ లాంటి స్టార్ కు బాగా అర్థమైంది.
అందుకే ఆచార్య సినిమా రిలీజైన తర్వాత ఎన్టీఆర్-కొరటాల మరోసారి కూర్చోబోతున్నారు. ఎక్స్ క్లూజివ్ గా మరో 2 వారాల పాటు సిట్టింగ్స్ ఏర్పాటుచేసుకొని.. కొన్ని సన్నివేశాలు, స్క్రీన్ ప్లే మార్చబోతున్నారు. దీంతో పాటు హీరోయిన్ ను కూడా మార్చబోతున్నారు. మొన్నటివరకు అలియా భట్ అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో, ఆ స్థానంలో రష్మికను తీసుకుంటున్నారు.
ఇక టెక్నికల్ గా కూడా సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకోసం ఇన్నాళ్లూ కొరటాల పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని కాదని, టాప్ టెక్నీషియన్స్ ను తీసుకుంటున్నారు. ఇలా మరిన్ని జాగ్రత్తలతో కొత్త సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు ఎన్టీఆర్. ఎందుకంటే, ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా ఇది. కాబట్టి ఆ రేంజ్ లో కాకపోయినా, కనీసం నార్త్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలి కదా.