ఉత్తర కొరియా తలచుకుంటే అమెరికా మటాష్ కావడం ఖాయమని చైనీస్ అధ్యయనంలో తేలింది. నార్త్ కొరియా అణు మిసైల్ ని ప్రయోగించిన పక్షంలో కేవలం 33 నిముషాల్లో అమెరికా నాశనమవుతుందని ఈ స్టడీ పేర్కొంది. ఉత్తర కొరియా నుంచి అమెరికా చాలా దూరంలో ఉన్నప్పటికీ ఖండాంతర అణు క్షిపణిని ప్రయోగిస్తే సుమారు 33 నిముషాల్లోనే అది టార్గెట్ ని ఛేదిస్తుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక సైతం తెలిపింది.
అమెరికా మీద నార్త్ కొరియా మిసైల్ దాడులకు సంబంధించిన అధ్యయనాన్ని చైనీస్ సైంటిస్టులు చేబట్టినప్పుడు వారు కనుగొన్న విషయాలు దిగ్భ్రాంతికరమైనవిగా, ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని ఈ పత్రిక వివరించింది. అమెరికాకు చెందిన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ .. ఉత్తర కొరియా న్యూక్లియర్ మిసైల్ ని అడ్డుకోలేక విఫలమైతే అమెరికా ప్రమాదంలో పడినట్టేనని వారు దాదాపు నిర్ధారించారని పేర్కొంది. ‘హ్వాసాంగ్-15 మిసైల్’ పేరిట వ్యవహరించే అణు క్షిపణి రేంజ్ 13 వేల కిలో మీటర్లు..ఇది వాషింగ్టన్ ను ఢీ కొనడానికి సరిపోతుంది అని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రానిక్ సిస్టం ఇంజనీరింగ్ సంస్థ వ్యాఖ్యానించింది.
ఈ సంస్ధకు చెందిన నిపుణులు నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలను విశ్లేషించారు. సెంట్రల్ నార్త్ కొరియా నుంచి మిసైల్ ని ప్రయోగిస్తే..అమెరికా లోని మిసైల్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయానికి 20 సెకండ్ల తరువాత ఈ సమాచారం అందుతుందని, దీంతో అమెరికా మిసైళ్లు అలాస్కా నుంచి 11 నిముషాల అనంతరం టేకాఫ్ అవుతాయని నిపుణుల బృందం అభిప్రాయపడింది.
తమ దేశ బలహీనతను ఇల్లినాయిస్ లోని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రెడరిక్ కె. లాంబ్ కూడా అంగీకరించారు. ఉత్తర కొరియా శక్తిమంతమైన అణు క్షిపణిని ప్రయోగించిన పక్షంలో తమ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ దాన్ని అడ్డుకోగలుగుతాయో లేదో చెప్పలేనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పసిఫిక్ ప్రాంతంలో అమెరికా-సౌత్ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేబట్టడం పట్ల ఉత్తర కొరియా అధినేత కిమ్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.