వలస కార్మికులంతా కరోనా భయానికి సొంతూరు వెళ్లిపోవాలని ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా కాస్త లేటుగా మేల్కొన్నా శ్రామిక్ రైళ్ల పేరుతో ప్రత్యేక రైళ్లను నడిపింది. గత 15 రోజులుగా శ్రామిక్ రైళ్లను నడుపుతున్న కేంద్రం వలస కూలీలను తమ స్వస్థలాలకు చేరుస్తుంది.
15రోజుల్లో దాదాపు 14 లక్షల మందిని తమ సొంత ప్రాంతాలకు తరలించినట్లు రైల్వే ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులతో పాటు వలస కార్మికులంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలనుకున్న వారిని తరలించాం. హోంశాఖ ఆదేశాల ప్రకారం ప్రత్యేక రైళ్లను నడిపామని, 1074 శ్రామిక్ రైళ్ల ద్వారా 14 లక్షల మందిని తరలించినట్లు రైల్వే పేర్కొంది.
ఇక గడిచిన 3 రోజుల్లో రోజుకు 2 లక్షల మంది చొప్పున తరలించినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. రానున్న రోజుల్లో రోజుకు 3 లక్షల ప్రయాణికుల చొప్పున తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, గోవా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ర్టాల నుంచి ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడిపినట్లు పేర్కొంది.