దేశంలో రూ.2000 నోట్ల సర్క్యులేషన్ తగ్గుతున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం.. రూ.2000 డినామినేషన్ కలిగిన బ్యాంకు నోట్ల సంఖ్య ఈ ఏడాది మార్చి చివరి నాటికి 214 కోట్లకు లేదా చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో 1.6 శాతానికి చేరుకుంది.
ఈ ఏడాది మార్చి నాటికి చలామణిలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్ల మొత్తం 13,053 కోట్లకు చేరింది. గత ఏడాదితో ఇది 12,437 కోట్లుగా ఉంది. మార్చి 2020 చివరి నాటికి, చెలామణిలో ఉన్న రూ. 2000 డినామినేషన్ నోట్ల సంఖ్య 274 కోట్లుగా ఉంది. ఇది మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో 2.4 శాతం.
మార్చి 2021 నాటికి చలామణిలో రూ. 2000 నోట్ల మొత్తం బ్యాంకు నోట్లలో 245 కోట్లకు లేదా 2 శాతానికి కౌంట్ క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 214 కోట్లకు లేదా 1.6 శాతానికి పడిపోయింది.
విలువ పరంగా చూస్తే రూ. 2000 డినామినేషన్ నోట్లు చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువలో 22.6 శాతం నుండి మార్చి 2021 చివరి నాటికి 17.3 శాతానికి, మార్చి 2022 చివరి నాటికి 13.8 శాతానికి తగ్గాయి.
ఆశ్చర్యకరంగా 500 రూపాయల నోట్ల సర్క్యులేషన్ బాగా పెరిగింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ.500 డినామినేషన్ నోట్ల సంఖ్య 3,867.90 కోట్ల నుంచి 4,554.68 కోట్లకు పెరిగింది.
పరిమాణం పరంగా రూ. 500 డినామినేషన్ నోట్లు అత్యధికంగా 34.9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత రూ.10 నోట్లు, మార్చి 31, 2022 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంక్ నోట్లలో 21.3 శాతం ఉన్నాయి.
2021 మార్చి చివరినాటికి అన్ని డినామినేషన్ల మొత్తం కరెన్సీ నోట్ల విలువ రూ.28.27 లక్షల కోట్లుగా ఉండగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.31.05 లక్షల కోట్లకు పెరిగింది.
విలువ పరంగా, రూ. 500, రూ. 2000 నోట్ల వాటా మార్చి 31, 2022 నాటికి చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల మొత్తం విలువలో 87.1 శాతంగా ఉంది, ఇది మార్చి 2021 చివరి నాటికి 85.7 శాతంగా ఉంది.
2020-21లో 16.8 శాతం, 7.2 శాతంతో పోలిస్తే 2021-22లో చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ, పరిమాణం వరుసగా 9.9 శాతం, 5 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.