పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భారీగా ఉగ్రవాదులు కాసుక్కూర్చునారని పాక్ హోం మంత్రి రాణా సనావుల్లా అన్నారు. సుమారు 10వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. సరిహద్దులోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో 7 నుంచి 10 వేల మంది వరకు తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఉన్నట్టు ఆయన చెప్పారు.
ఉగ్రవాదులతోపాటు వారి కుటుంబ సభ్యులు మరో 25 వేల మంది దాకా ఉన్నట్టు ఆయన వివరించారు. ఇటీవల పాక్ పై టీటీపీ ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారు. ఇటీవల ఆత్మాహుతి దాడికి కూడా టీటీపీ ఉగ్రవాదులు తెగపడ్డారు. 2014 తర్వాత ఆత్మాహుతి దాడి జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
నవంబరు నుంచి టీటీపీ ఉగ్రవాదులు దాడులు ఎక్కువయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉగ్రవాద వ్యతిరేక దళ విభాగ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని స్థానికులు నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే రక్షణ కోసం తమను కోరవచ్చని చెప్పారు. సరిహద్దులను కాపాడేందుకు పాక్ కు సైన్యం ఉందని ఆయన అన్నారు. సైన్యాన్ని రంగంలోకి దించితే ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తారని ఆయన హెచ్చరించారు. ఆ రాష్ట్రంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధికారంలో ఉంది.