మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ ప్రతినిధి నుపుర్ శర్మకు ఢిల్లీ పోలీసులు గన్ లైసెన్స్ జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసినందుకు నుపుర్ శర్మను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు ఏకధాటిగా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో నుపుర్ కు గన్ లైసెన్స్ జారీ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. తన భద్రతకు ముప్పు ఉన్నందు వల్ల వ్యక్తిగతంగా తనతో పాటు ఓ గన్ ను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె దరఖాస్తు చేశారు.
2022, మే 26వ తేదీన జ్ఞానవాపి కేసు విచారణ సమయంలో నూపుర్ శర్మ గత ఏడాది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో దుమారం చెలరేగింది. దీంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. అనంతరం ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను గాయపరచేందుకు కాదని, శివలింగాన్ని ఎగతాళి చేస్తూ ఓ ప్యానెలిస్ట్ మాట్లాడటంతో తాను తిప్పికొట్టడం కోసమే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు.
అయినప్పటికీ నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ అమరావతి, ఉదయ్ పూర్ లో ఘోర ఘటనలు జరిగాయి. అమరావతిలో ఉమేశ్, ఉదయ్‌పూర్ లో కన్హయ్యలాల్ ల తలను ఉన్మాదులు నరికివేశారు. అయితే నుపుర్ శర్మపై దేశవ్యాప్తంగా మొత్తం 10 కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులను సుప్రీంకోర్టు ఒకే దగ్గరకు ట్రాన్స్‌ఫర్ చేసింది. మరోవైపు ఆమెను హత్య చేస్తామంటూ పలువురు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో తనకు వ్యక్తిగత తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని నూపుర్ శర్మ ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేశారు. ఆమె భద్రతకు ముప్పు ఉన్నట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు ఆమె దరఖాస్తుకు ఆమోదం తెలిపారు.