ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆమెను త్వరలోనే బీజేపీ ఓ పెద్ద నాయకురాలిగా చేస్తుందని పేర్కొన్నారు.
నూపుర్ శర్మను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆమెపై దేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఆమెపై రాజ్యంగ ప్రకారమే చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
రాబోయే ఆరేడు నెలల్లో నూపుర్ శర్మకు బీజేపీలో ఉన్నత పదవులు దక్కుతాయన్నారు. త్వరలోనే ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందన్నారు.
నూపుర్ శర్మను బీజేపీ రక్షిస్తోందన్నారు. ఆమె అరెస్టుపై ప్రధాని మోడీని తాము అభ్యర్థించామని, కానీ దానిపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు.
నూపుర్ శర్మపై తమ పార్టీ తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. నూపుర్ శర్మను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీకి పోలీసులను పంపాలని తెలంగాణ ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులను కోరామన్నారు.