నర్సుల నియామకాలను కాంట్రాక్టు/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కాకుండా రెగ్యులర్ విధానంలో చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న నర్సుల రిక్రూట్‌మెంట్ పిటిషన్‌పై ప్రభుత్వమే చొరవ తీసుకొని.. 3,311 నర్సు పోస్టులను భర్తీ చేయాలని కోరింది. 2017-18లో నర్సు పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షకు లక్ష మంది అభ్యర్థులు హాజరయ్యారని.. అయితే ఇందుకు సంబంధించిన వివాదంలో హైకోర్టులో తీర్పు ఇంకా రిజర్వులోనే ఉందని.. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులు అయోమయంలో పడ్డారని అసోసియేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సుల సమస్యలను తెలుసుకోవడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అభ్యర్థించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఆసుపత్రుల్లో నర్సులకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల లభ్యతను పెంచాలని, ఆసుపత్రి నుంచి ఇంటికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, ఆరు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని, కరోనా సోకిన నర్సులకు స్పెషల్ లీవ్ కల్పించాలని, కరోనా డ్యూటీ చేస్తున్నవారికి రోజుకు రూ. 1,500 అలవెన్సు ఇవ్వాలని, రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే, కరోనా డ్యూటీ చేస్తున్నవారికి బీమా సౌకర్యం కల్పించాలని.. ఇలా మొత్తం 11 డిమాండ్లను సీఎంకు రాసిన లేఖలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రస్తావించింది