సొంతిల్లు కట్టుకోవాలని కలలుగన్న ఆ కుటుంబానికి కన్నీళ్లే మిగిలాయి. పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టేపనిని బిల్డర్‌కు అప్పజెప్తే.. అతడు నిండా ముంచేశాడు. ఏం చేయాలో తెలియక న్యాయం కోసం స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తే.. వారు కనీసం పట్టించుకోకపోగా ఆ కుటుంబంలో తీరని శోకానికి కారణమయ్యారు. మల్కాజిగిరిలో నియోజకవర్గం అల్వాల్‌లో టీఆర్ఎస్ నేతల ధనదాహానికి ఓ కుటుంబం తమ అండను కోల్పోయింది. ఫిజయోథెరపీ డాక్టర్ కావాల్సిన ఆ ఇంటి అమ్మాయి.. అర్ధాంతరంగా ఆత్మహత్యచేసుకోవాల్సి వచ్చింది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా.. స్థానిక కార్పొరేటర్ జితేందర్ రెడ్డి నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి వరకు అంతా కలిసి.. ఓ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారు.
అల్వాల్ పీఎస్ పరిధిలోని సాయిరెడ్డి నగర్ కాలనీ మచ్చబొల్లారానికి చెందిన సుగుణవల్లి అనే అమ్మాయి ఫిజయోథెరపీ థర్డ్ ఇయర్ చదువుతోంది. సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో తన కుటుంబం, తాను సంపాదించిన డబ్బును.. స్థానికంగా ఉండే ఓ బిల్డర్‌కు అప్పగించింది. రూ.5.30 లక్షలకు కాంట్రాక్ట్ మాట్లాడుకోగా.. అందులో రూ. 4.30 లక్షలు చెల్లించింది. అయితే నెలలు, ఏడాది గడిచిపోయినా ఆ బిల్డర్ ఇంటిని పూర్తి చేయలేదు. డోర్లు, బాత్‌రూం, ఎలక్ట్రిసిటీ వంటి పనులేవి చేయకుండా వదిలేశాడు. దీంతో స్థానిక కార్పొరేటర్ జితేందర్ రెడ్డికి అనేకసార్లు ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సమస్యతో తాను డిప్రెషన్‌లోకి వెళ్తున్నానని..ఏం చేసుకుంటానో అన్న భయం వేస్తోందంటూ వాట్సాప్‌లో మెసేజులూ పంపింది. కానీ ఆయన పట్టంచుకోలేదు. కాలనీ ప్రెసిడెంట్‌ను ఆశ్రయిస్తే ఆయన కూడా పట్టించుకోలేదు. పైగా బిల్డర్‌కే వత్తాసు పలికాడు.
ఓసారి తాముండే ఏరియాకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా రాగా..తన తల్లితో కలిసి ఆయన దగ్గరకు వెళ్లింది సుగుణవల్లి. న్యాయం చేయాలంటూ ఇద్దరూ ఎమ్మెల్యే కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. డబ్బులు తీసుకుని బిల్డర్ మోసం చేశాడని.. తమ ఇంటి పరిస్థితి చూడాలని కోరారు. కానీ ఎమ్మెల్యే మైనంపల్లి మనసు కరగలేదు. బిల్డర్‌కు డబ్బులు ఇస్తే.. అతనే కంప్లీట్ చేస్తాడంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి పంపించాడు. కూర్చుని మాట్లాడుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో న్యాయం చేసేవారు లేక.. ఇంకా ఎవరికి చెప్పుకోవాలో తెలియక సుగుణవల్లి మనస్తాపంతో గత నెల 18న ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికీ తమ కుటుంబానికి న్యాయం జరగడం లేదని ఆమె కుటుంబం తాజాగా మీడియాను ఆశ్రయించింది. కనీసం ఎమ్మెల్యే తమ సమస్యను పట్టించుకున్నా తమ కూతురు తమకు దక్కేదని కన్నీటి పర్యంతమవుతోంది.