కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. జీవనోపాధి కోల్పోయి లక్షలాది కటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 12,442 ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు ) కుటుంబాలు తమ పెద్ద దిక్కు కోల్పోయాయని తాజాగా వెల్లడైంది. అలాగే 7,727 షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) కుటుంబాల్లో సంపాదించేవారు కన్నుమూసినట్టు తెలిసింది. వీరంతా కూడా మధ్య కాలంలో చనిపోయినవారేనని నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ షెడ్యూల్ క్యాస్టెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తమ సర్వేల్లో గుర్తించాయి. చనిపోయిన వారంతా కూడా 18-60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారేనని వెల్లడించాయి.
మరోవైపు ఇందులో అత్యధికంగా ప్రభావితమైన కుటుంబాల్లో ఏపీకి చెందినవారే అధికంగా ఉన్నట్టు ఆయా సంస్థలు వెల్లడించాయి. ఏపీలో 4,948 ఓబీసీ కుటుంబాలు, ఎస్సీ కుటుంబాల్లో 2,106 మంది పెద్ద దిక్కును కోల్పోయాయని తెలిపాయి. మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే.. ఓబీసీలకు సంబంధించి కేరళ- 2,100 గుజరాత్ లో 1,934 మరణించినట్టు గుర్తించాయి. ఒక ఎస్సీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తర్వాత గుజరాత్- 1,457, మహారాష్ట్రలో 836 కుటుంబాలు బాధితులైనట్టు నిర్ధారించాయి.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కుటుంబాలకు కేంద్రం తగిన జీవనోపాధి కల్పించాల్సి ఉంది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం.. వీరికి తగిన ఎక్స్గ్రేషియాతో ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సిద్ధం చేస్తోంది. కాగా ఇప్పటికే కేంద్రం SMILE (Support for Marginalised Individuals for Livelihood and Enterprise) పథకం కింద వారిని ఆదుకోవాలని నిర్ణయించింది. రూ. 3 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు తొలుత సాయం చేయనుంది.