తెలంగాణలో త్వరలో జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీల వ్యవహరించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి, రెండు మినహా అన్ని పార్టీలు కూడా ఓసీ సామాజిక వర్గ అభ్యర్థులకే పెద్దపీట వేయడం మిగిలిన వర్గాల్లో అసంతృప్తిని రాజేస్తోంది. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వారి వివరాలను గమనిస్తే.. టీఆర్‌ఎస్ అభ్యర్థి అయిన పీవీ కుమార్తె వాణీదేవి, బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న చిన్నారెడ్డి, ఆర్ఎల్‌డీ అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్, వామపక్షాలు బలపరుస్తున్న నాగేశ్వర్.. ఇలా అందరూ ఓసీ వర్గానికి చెందినవారే కావడం చర్చనీయాంశంగా మారింది. యాధృచ్చికమో లేక వ్యూహాత్మకమో తెలియదు కానీ.. అన్ని పార్టీలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడంపై ఆయా పార్టీల్లోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో కేవలం రెండు పార్టీలు మాత్రమే బీసీ అభ్యర్థులను పోటీకి దింపాయి. టీడీపీ తరపు అభ్యర్థి ఎల్.రమణ, తెలంగాణ యువసేన పార్టీ అభ్యర్థి అడపా సురేందర్ ..ఈ ఇద్దరు మాత్రమే బీసీ నేతలుగా ఉన్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో కూడా పలువురు బీసీలు ఉన్నారు. ప్రధాన పార్టీలన్నీ ఓసీ అభ్యర్థులనే రంగంలోకి దింపడంతో ఈసారి బీసీ కార్డు ప్రచారంలో ప్రధాన అస్త్రంగా పనిచేసే అవకాశముందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అటు ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానంలోనూ అంతే. కాంగ్రెస్ మినహా ప్రధాన పార్టీలు ఓసీ అభ్యర్థులకే అవకాశం ఇచ్చాయి. టీఆర్‌ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి , బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అందరూ ఓసీ వర్గానికి చెందినవారే. ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఎస్టీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు అవకాశం కల్పించింది. ఇక ఈ స్థానంలో యువతెలంగాణ పార్టీ తరపున రాణి రుద్రమరెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థిగా చెరుకు సుధాకర్, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, జర్నలిస్ట్ జయసారథితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.