– ఖాళీ స్థలం కనిపిస్తే కన్నుపడ్డట్టే
– అమాయకపు పేద ప్రజలే టార్గెట్
– అల్వాల్ లో 6 ఎకరాల 4 గుంటల భూమి కబ్జా
– మైనంపల్లి అనుచరులే అంటున్న బాధితుడు
– తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధిత కుటుంబం
తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత గులాబీ కోరల్లో చిక్కుకున్న అమాయక ప్రాణాలెన్నో. దొరికిన కాడికి దోచుకోవడం.. అందిన కాడికి ఆరగించడమే తమ పనిగా పెట్టుకొని అక్రమ దందాలకు, భూకబ్జాలకు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు రోజుకోచోట వినిపిస్తూనే ఉన్నాయి. ఖాళీ స్థలం కనబడితే చాలు.. టీఆర్ఎస్ నేతలు కన్నుమూసి తెరిచేలోపే కబ్జాలు పెట్టేస్తారనేంతగా వారి అక్రమాలు పెరిగిపోయాయని అంటున్నారు. అధికారం ఉందని అడిగేదెవరని అందినకాడికి మూట కట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సామాన్య ప్రజలే టార్గెట్ గా పెట్టుకున్న టీఆర్ఎన్ అఫ్ఘనిస్తాన్ తాలిబన్ లను మించి పోయారని మండిపడుతున్నారు.
తాజాగా.. హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో గల 578 , 579 , 576 సర్వే నెంబర్లలో ఉన్న 6 ఎకరాల 4 గుంటల భూమిని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు కబ్జా పెట్టారని అజిత్ జిలాని అనే బాధితుడు ఆరోపిస్తున్నాడు. తమ తాతల ముత్తాతల కాలం నుండి ఆ భూమిలో తామే వ్వవసాయం చేసుకుంటున్నామని చెప్తున్నాడు. తమ పూర్వికులనుండి ఆ భూమికి సంబంధించిన పట్టా పాసు పుస్తకాలతో పాటు.. పహానీలు తమ పేరుమీదనే ఉన్నాయని తెలిపాడు బాధితుడు.
అయితే.. తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి నవభారత సొసైటీ అనే సంస్థ పేరుతో.. వడ్డేపల్లి నరసింహారావు, జె.సుధాకర్, మహిపాల్ రెడ్డి, రామ్ రెడ్డి, స్వామి గౌడ్, ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తులు అక్రమంగా కబ్జా పెట్టారని ఆరోపించాడు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితుడు అజిత్ జిలాని విజ్ఞప్తి చేశాడు. భూముల విలువ పెరగడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండతో కొంతమంది రియల్ మాఫియా తమకు సంబంధించిన వ్యవసాయ భూమిపై కన్నేసి కబ్జాకు కట్రలు చేస్తున్నారని ఆరోపించాడు.
అల్వాల్ ప్రాంతంలో వెయ్యి గజాల స్థలంలో భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుండి అనుమతులు తెచ్చుకుని.. రౌడీలు, పోలీసుల అండతో బలవంతంగా తమను భూమిలో నుండి వెళ్లగొట్టారని వాపోయాడు. వారు వేసుకున్న గుడిసెలను కూల్చివేసి అక్కడ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారని చెప్పాడు. నవభారత్ సొసైటీ ఆక్రమణలపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తే అసలు అది మీ భూమి కాదని.. పేదలకు పట్టాలు చేసి ఇచ్చిన స్థలం అని.. అక్కడికి పోవద్దని బెదిరించారని ఆరోపించాడు. ట్రిబ్యునల్ తీర్పును అమలు చేసి నవభారత్ సొసైటీ సభ్యుల దౌర్జన్యంపై కేసులు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు జిలాని.
పైగా స్థలానికి సంబంధించిన సర్వే వివాదంపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే నిర్మాణ పనులను నిర్వహిస్తున్నారని చెప్పాడు. తప్పుడు బైలాస్ తో నిర్మాణాలు చేపడుతోందని నవభారత్ ను కోర్టు రద్దు చేసినప్పటికీ.. వెంకటేశ్వర సొసైటీ అనే పేరుతో మరో సంస్థను స్థాపించి.. తమ వ్యవసాయ భూమిని అక్రమంగా కొందరికి రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు. లింకు డాక్యుమెంట్లు లేకుండా రిజిస్ట్రేషన్ శాఖఅధికారులు.. ఈ భూమితో సంబంధం లేని అహ్మద్ ఫైజల్, అహ్మద్ సహా వారి కుటుంబ సభ్యులకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు జిలాని.