జె.ఎన్.యు లో విద్యార్దులపై దాడికి నిరసనగా ఆదివారం రాత్రి నుంచి ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న వందలాది మందిని ఈ తెల్లవారు జామున బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. గేట్ వే ఆఫ్ ఇండియాకు 2 కిలో మీటర్ల దూరంలోని ఆజాద్ మైదాన్ కు తరలించారు. దీంతో వారి నిరసన కార్యక్రమం తాత్కాలికంగా ఆగిపోయింది. అయినప్పటికీ వందలాది మంది స్పందించడంతో తమ నిరసన కార్యక్రమం విజయవంతమైందని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్ది కపిల్ అగర్వాల్ అన్నారు. తాము ఆజాద్ మైదాన్ ను వదిలి వెళ్తున్నప్పటికీ నిరసన మాత్రం కొనసాగుతుందని తెలిపారు. తమకు దీర్ఘకాలిక కార్యక్రమాలు ఉన్నట్టు చెప్పారు.
నిరసనకారుల్లో కొందరు తాము చెప్పగానే స్వచ్ఛందంగా వచ్చారని…కొందరిని మాత్రం బలవంతంగా తీసుకెళ్లామని చెప్పారు. టూరిస్ట్ సెంటరైన గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర సరైన టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం లేదని.. బిజీ సెంటర్ లో నిరసన కారులను కంట్రోల్ చేయడం కష్టమైనందున అక్కడి నుంచి తరలించామని చెప్పారు.