ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. ప్రైవేటీకరణకు వీలు లేదని, 2017 వరకు లాభాల్లో ఉన్న పరిశ్రమను నష్టాల పేరుతో ప్రైవేటుపరం చేయటం దారుణమని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. మరోవైపు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నారు. ఉక్కు పరిశ్రమ కోసం కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని కోరుతున్నారు.
కానీ కడప స్టీల్ ప్లాంట్ ను కాదని… బయ్యారం ఉక్కు పరిశ్రమను పక్కనపెట్టి… విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం అయ్యేలా ఒడిశాకు ఉక్కు పరిశ్రమను కేంద్రం కేటాయించింది. ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి తన సొంత రాష్ట్రానికి 50వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమను తీసుకపోయారు.
ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టర్ ఇండియాలో ఓ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనిపై భారత ప్రభుత్వాన్ని సంప్రదించగా… ప్రత్యేకంగా గనులు కేటాయించటంతో పాటు 50వేల కోట్ల పెట్టుబడితో వస్తున్న పరిశ్రమను ఒడిశాలో నెలకొల్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయిస్తే లాభాల బాట పడుతుందని నిపుణులు చెప్తే పెడ చెవిన పెట్టిన ప్రభుత్వం… ప్రైవేటు కంపెనీకి మాత్రం గనులు కేటాయించేందుకు ముందుకు రావటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఏపీ సీఎం జగన్ కేంద్రంపై ఈ సమయంలో ఒత్తిడి తీసుకరాకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.