ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూరీలోని షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. దీంతో కాంప్లెక్స్‌లోని 40 దుకాణాలు దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న 100 మందికి పైగా ప్రజలను అధికారులు కాపాడారు.
వివరాల్లోకి వెళితే…లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ఉన్న గార్మెంట్ స్టోర్‌లో నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. క్షణాల్లోనే మంటలు కాంప్లెక్స్ మొత్తానికి వ్యాపించాయి. దీనిపై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదపులోకి తీసుకు వచ్చారు. ఈ భవనంలోనే షాపింగ్ కాంప్లెక్స్, హోటల్, బ్యాంకులు ఉన్నాయి. పూరీ జగన్నాథుని దర్శనానికి వచ్చిన 106 మంది ఆ భవనంలోని ఓ హోటల్‌లో ఉన్నారు.
మంటలు హోటల్కు కూడా వ్యాపించడంతో భక్తులంతా అందులో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని సురక్షితంగా భవనం నుంచి బయటకు తీసుకు వచ్చారు. భవనం పై భాగంలో అపస్మారక స్థితిలో పడిపోయిన ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.