ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిషోర్ దాస్ పై ఆదివారం ఉదయం ఓ ఎస్సై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన ఛాతీకి బుల్లెట్ గాయాలు కాగా.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఒడిశా లోని ఝార్సుగూడా జిల్లా బజరంగ్ టౌన్ లో ఓ మీటింగ్ కి హాజరయ్యేందుకు కిశోర్ దాస్ వెళ్తుండగా గోపాల్ దాస్ అనే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తన సర్వీసు రివాల్వర్ నుంచి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఆయనపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇందుకు కారణాలు తెలియలేదు. అయితే గోపాల్ దాస్ ను కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి నవ కిషోర్ దాస్ కి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతికరమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. బహుశా ఈ దాడి ప్లాన్ ప్రకారమే జరిగినట్టు భావిస్తున్నారు.
అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏమైనా ఈ హఠాత్సంఘటన అక్కడ తీవ్ర సంచలనం కలిగించింది.
బిజూ జనతాదళ్ కార్యకర్తలు ఆ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. 2024 ఎన్నికల నేపథ్యంలో ఈ బీజేడీ నేతపై దాడి జరగడం ఖండించదగినదని ప్రసన్న మొహంతి అనే జర్నలిస్టు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఓ ఆలయానికి ఈ మంత్రి ఇటీవల కోటి రూపాయల విలువైన బంగారు కలశాన్ని విరాళంగా ఇచ్చినట్టు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి.