ఒడిశాలో హానీ ట్రాప్ కేసును పోలీసులు ఛేదించారు. తన అందచందాలతో బడా రాజకీయ నాయకులు, అధికారులను కూడా బుట్టలో వేసుకుని వారిని బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు గుంజిన అర్చనా నాగ్ అనే కిలాడీ లేడీని ఈ నెల 7 న పోలీసులు అరెస్టు చేశారు. ఈమె ఈ-మెయిల్ లో 64 మందికి పైగా ఫోటోలను వారు కనుగొన్నారు. భువనేశ్వర్ లో ఈమె అరెస్టు సంచలనం రేపింది. ఈ ఫొటోల్లో పలువురు ప్రముఖులు, రైల్వే అధికారులు, తహసీల్దార్లు, పొలిటికల్ లీడర్లు ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈమె సుమారు 20 మంది హైప్రొఫైల్ వేశ్యలను రప్పించి ధనిక కస్టమర్లను ఆకర్షించేలా చేసేదని, వారిని రాసలీలల్లో దింపి ఫోటోలు, వీడియోలు తీయించేదని తెలిసింది.
తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన కస్టమర్లు అర్చన డిమాండ్ చేసినంత సొమ్ము ముట్టజెప్పేవారని వెల్లడైంది. ఈమెతో పని చేసిన కాల్ గర్ల్స్, వేశ్యల ఫోటోలు, వారి ఆధార్ కార్డులను, బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు. అర్చన బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను తెలియజేయాలని రిజర్వ్ బ్యాంకును కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభమైందని, ఇంకా ఈ రాకెట్ లో ఎవరెవరి ప్రమేయముందో తెలుసుకుంటున్నామని భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ చెప్పారు. అర్చన భర్త జగబంధు చాంద్ కి నోటీసు జారీ చేశామన్నారు. అతని అనారోగ్యం దృష్ట్యా ప్రస్తుతం ఇంటరాగేట్ చేయలేకపోతున్నామన్నారు.
అర్చనా నాగ్ కి సుమారు 30 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్క భువనేశ్వర్ లోనే రూ. 3 కోట్ల ఖరీదైన బంగళా, నఖారా ప్రాంతంలో ఫామ్ హౌస్, ఓ కార్ షో రూమ్ కి సంబందించి షేర్లు, ఖరీదయిన కార్లు, ఫర్నిచర్ ఉన్నట్టు వారు తెలిపారు. డబ్బున్న బడా బాబులు తనకు వీటిని గిఫ్ట్ ఇచ్చారని అర్చన అంగీకరించిందని చెప్పారు.
మంత్రులు, హోటల్ యజమానులు, వ్యాపారవేత్తలు.. ఇలా ఈమె కస్టమర్ల జాబితాలో చాలామంది ఉన్నారని వారు పేర్కొన్నారు. వీరి నుంచి ఈమె 11 కోట్ల నగదును రాబట్టిందట. ఆమెను ఓ అజ్ఞాత ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఇంటరాగేట్ చేశారు. అర్చన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టివేయడంతో ఝార్పడ జైలుకు తరలించారు. ఈమెపై పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.