ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొత్తు కోసం బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని తాము సంప్రదించినట్టు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఆమెకు ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీ ఆఫర్ చేసిందని, అయితే ఆ ప్రతిపాదనలకు ఆమె స్పందించలేదని ఆయన తెలిపారు.
‘ది దళిత్ ట్రూత్’ అనే పుస్తకావిష్కరణ సభలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యూపీలో కూటమిని ఏర్పాటు చేద్దామని మాయావతిని తాము అడిగినట్టు తెలిపారు. కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉండాలని ఆమెను కోరినట్టు తెలిపారు. కానీ దానికి ఆమె స్పందించలేదన్నారు.
కనీసం ఈ విషయంపై ఆమె తమతో మాట్లాడలేదన్నారు. సీబీఐ, ఈడీ, పెగాసిస్ కేసులకు భయపడి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మార్గాన్ని ఆమె సుగమం చేసిందన్నారు. తనకు కాన్షీరాం లాంటి వారంటే ఎంతో గౌరవమన్నారు. వారు యూపీలో దళితుల గొంతుకను వినిపించేందుకు తమ రక్తాన్ని ధారపోశారని తెలిపారు.
ఆ సమయంలో కాంగ్రెస్ నష్టపోయిందని, అది వేరే విషయమని అన్నారు. కానీ నేడు ఆయన ఆశయాల కోసం పోరాడలేనని మాయావతి చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్, మహాత్మ గాంధీ చూపిన మార్గంలో దళితులు తమ హక్కల కోసం పోరాడాలన్నారు.