కాయ్ రాజా కాయ్.. భలే ఆఫర్లు .. పెద్ద పండుగ రోజుల్లో ప్రత్యేక ఆఫర్లు. ఏంటీ? ఈ-కామర్స్ సంస్థలు , వస్త్ర దుకాణాల ఆఫర్లు అనుకుంటున్నారా? కాదండీ.. ఏపీలో కోడిపందేల బరుల వద్ద ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఊహించని ఆఫర్లతో ఈసారి బరుల నిర్వాహకులు పందెంరాయుళ్లను ఆకర్షిస్తున్నారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో కోడి పందేలు ఆడేవారికి బహుమతులుగా బుల్లెట్ బండ్లు, స్కూటీలు ఆఫర్లుగా ప్రకటించారు. నిర్వాహకుల మధ్య పోటీ విపరీతంగా ఉండడంతో ఆఫర్లను తెరపైకి తెచ్చారు.
మండలంలో రెండేళ్లుగా 6 బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహిస్తున్నారు. వీటిలో సగం పెద్దవే కావడంతో నిర్వాహకుల మధ్య పోటీ తీవ్రమైంది. దీంతో పందెం కాసేవారిని ఆకర్షించేందుకు కౌతవరం, వేమవరం బరుల నిర్వాహకులు సరికొత్త ఐడియాతో ముందుకొచ్చేశారు.
రూ. 2 లక్షల విలువైన కోడిపందేలను వరుసగా ఐదుసార్లు ఆడితే రూ. 1.75 లక్షల విలువైన బుల్లెట్ బండిని, లక్ష విలువైన పందేలు వరుసగా ఐదుసార్లు ఆడితే స్కూటీని బహుమతులుగా అందించనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, వాటిని బరుల వద్దే ప్రదర్శనకు ఉంచి పందెంగాళ్లను ఆకర్షించే పనిలో పడ్డారు.