పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్స్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలుష్య నివారణ నిబంధనలు పాటించడం లేదని తేలడంతో.. ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది.
లోటుపాట్లను సరిచేయాలని పన్నెండు సూచనలు చేసినప్పటికీ.. ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభోత్సవానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా గత ఏడాది కాలంగా కర్మాగారంలో యూరియా ఉత్పత్తి చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
పరిశ్రమ నుంచి అమ్మోనియా లీక్ వల్ల కొన్నాళ్లుగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామగుండం ఎమ్మెల్యే పీసీబీకి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా కార్మికులకు తగిన వైద్య సదుపాయాలు కల్పించలేదని.. ఉత్పత్తి అయిన అమ్మోనియా నిల్వ చేయడానికి సరైన స్థలం లేదని పిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన పీసీబీ తనిఖీలు నిర్వహించింది. పూర్తిస్థాయిలో కార్మికులకు వైద్య సేవలు అందుబాటులో లేవని ఉత్తర్వుల్లో పేర్కొంది. కర్మాగారానికి సరైన బాధ్యులను నియమించలేదని.. అధిక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న దృష్ట్యా తగు చర్యలు చేపట్టాలని పీసీబీ సూచించింది.