తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా రైతుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో చెరువులకు గండిపడినా.. తూములు ధ్వంసమైనా.. ప్రభుత్వం శాశ్వత పరిష్కారాలు చూపించడం లేదు. తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువుకట్ట కాలువకు శుక్రవారం రాత్రి గండి పడటంతో నీరంతా వృథాగా పోయింది. శుక్రవారం సాయంత్రం యాసంగి పంట సాగుకు ఆ చెరువుకు తూము నుంచి నీటిని విడుదల చేశారు.
అంతకుముందే తూము ధ్వంసం కావడంతో.. ఇప్పుడు విడుదల చేసిన నీటి ప్రవాహం ఒత్తిడి కూడా పెరగడంతో పంట కాలువకు గండి పడింది. సమీపంలోని పొలాల్లో నీళ్లు చేరడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వృధాగా పోయిన నీరంతా పొలాల మీదుగా వాగులోకి చేరింది. దీనికి సమీపంలోనే ఉన్న విద్యుత్ ఉపకేంద్రంలోకి నీరు వచ్చే అవకాశం ఉందని భయాందోళన చెందిన సిబ్బంది బయటికి వచ్చేశారు.
విషయం తెలుసుకున్న పురపాలక సిబ్బంది తూము వద్ద జేసీబీ సాయంతో వరి కట్టలు అడ్డుగా వేసి నీటి ప్రవాహం ఆపడంతో రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ధ్వంసమైన తూముకు మరమత్తులు చేయించకుండా ఒకేసారి నీటిని విడుదల చేయడంతో గండి పడినట్లు భావిస్తున్నారు.