హైదరాబాద్, తొలివెలుగు: రాష్ట్రంలో దేవాదాయశాఖ అవలంబిస్తున్నవిధానాలపై ఒగ్గు బీర్ల కళాకారులు మండిపడుతున్నారు.సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో తమని గర్భగుడి పూజల నుండి బహిష్కరించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
మల్లన్న ఒగ్గు కథ చెపుతూ.. ఒగ్గు సంప్రదాయ పూజలు చేసి తమ కళను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు.కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఎన్నో ఏళ్లుగా పూజారులుగా కొనసాగుతున్న తమను తొలిగించి.. వీర శైవ పూజారులను కొనసాగించడంపై వారు అభ్యంతరం తెలిపారు. స్వామి వారి మేలుకొలుపు, పవళింపు సేవ ఒగ్గు పూజారులచే మూల విరాట్ మల్లన్న స్వామి దగ్గర నిలబడి చేయించడం ఆనవాయితీగా ఉందని వారు చెప్పారు.
ఆ సేవలు, పూజల నుండి తమని దేవస్థానం అధికారులు దూరం చేయడం అన్యాయమని అన్నారు. తరతరాలుగా స్వామి వారికి చేస్తున్న సేవలను యధావిధిగా ఒగ్గు పూజరులచే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో తమ పొట్టను కొట్టడమే కాకుండా సంప్రదాయాలను కూడా మంటగలుపుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో తక్షణమే సీఎం కేసీఆర్, దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.