ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ లోని గ్యాస్ టెర్మినల్స్, ఆయిల్ ట్యాంకర్లు లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేసింది.
దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన కార్కివ్ లోని గ్యాస్ పైప్ లైన్ ను రష్యా పేల్చివేసింది. దీంతో పాటు నైరుతి కైవ్ లోని వాసిల్కివ్ నగరంలోని ఆయిల్ టెర్మినల్ పైనా రష్యా దాడులు చేసింది.
ఈ పేలుడు సంభవించినప్పుడు పుట్టగొడుగు మేఘంలా కనిపించిందని స్టేట్ సర్వీసెస్ ఆఫ్ స్పెషల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ తెలిపింది. దీనివల్ల పర్యావరణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆ సంస్థ హెచ్చరించింది.
ప్రజలను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేసింది. ప్రజలు తమ కిటికీలను తడి గుడ్డతో కవర్ చేయాలని సూచించింది. వీలైంనత వరకు ఎక్కువగా ద్రవాలు తాగాలని చెప్పింది.
కాగా రష్యా అణుదాడులకు పాల్పడినట్టు వదంతులు వినిపించాయి. వాటిని ఆ సంస్థ తోసిపుచ్చింది. పేలుడు చూడటానికి అలా కనిపించినా అది అణుదాడి కాదని స్పష్టం చేసింది.