సివిల్స్ లో మూడో ర్యాంక్ సాధించిన తెలంగాణా తేజం ఉమాహారతి.. ఓ ముఖ్యమైన మెసేజ్ ని అభ్యర్ధులకు షేర్ చేశారు. పరీక్షల్లో ఫెయిలయినంత మాత్రాన.. బాధపడవలసిన అవసరం లేదని, తాను కూడా ఎన్నోసార్లు ఫెయిలయ్యానని తెలిపారు. మీ దీక్షే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉత్తీర్ణులయ్యేలా చేస్తుంది అని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన ఆమె యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షల్లో టాప్ ఫోర్ ర్యాంకులు సాధించినవారిలో ఒకరు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇషితా కిషోర్, గరీమా లోహియా, స్మృతి మిశ్రా ఈ పరీక్షల్లో తమ ప్రతిభను చాటుకున్నారు.
మీడియాతో మాట్లాడిన నూకల ఉమా హారతి.. ఈ ఎగ్జామ్స్ కోసం ఐదో సారి తాను ప్రయత్నించానని, ఇది బృహత్ యత్నమని, ఏ మాత్రం సులభం కాదని అన్నారు. ‘లోగడ చేసిన ఎన్నో పొరబాట్లను సరిదిద్దుకున్నా.. సివిల్ సర్వీసులకు నన్ను మా తండ్రి ఎంతో మోటివేట్ చేశారు.. నిజానికి నా కుటుంబమంతా నన్ను ప్రోత్సహించింది .. ముఖ్యంగా నువ్వు కెరీర్ లో ఎదగాలంటే ఎంతో కృషి చేయాలి.. నీ లక్ష్యానికి పాటుపడాలి అని నాన్నగారు చెప్పేవారు’ అని ఉమాహారతి వెల్లడించారు.
విజయానికి సింగిల్ సక్సెస్ ఫార్ములా అంటూ ఏదీ లేదని, పరీక్ష మీద ఏకాగ్రతతో దృష్టి పెట్టాలని, మీ వ్యూహానికి పదును పెట్టాలని ఆమె యువ అభ్యర్థులకు సూచించారు. పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోయినప్పటికీ ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సిన సత్తా ఉండాలని అన్నారు. మరీ ఎక్కువగా చదవకండి.. ఎంతవరకు చదవాలో అంతవరకే చదవండి.. ఇది కాంపిటీటివ్ పరీక్ష.. ప్రాక్టీస్ అన్నది చాలా ముఖ్యం..దానిపైనే దృష్టి పెట్టండి అని ఆమె పేర్కొన్నారు.
ఐదేళ్ల నా కృషికి ఇది బహుమతి అని వ్యాఖ్యానించిన ఆమె.. తన వ్యక్తిగత విషయాలను కూడా వివరించారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు తన తండ్రి అని, తల్లి శ్రీదేవి గృహిణి అని, తమ్ముడు సాయి వికాస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కి ఎంపికై ముంబైలో జాబ్ చేస్తున్నాడని ఉమాహారతి తెలిపారు. 2017 లో బీ టెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్ మీద దృష్టి పెట్టానని, ఢిల్లీలో కోచింగ్ కి వెళ్లినా ఆ కోచింగ్ తీరు నచ్చక తిరిగి ఇంటికి వచ్చి సొంతంగా ప్రిపేర్ అవుతూ వచ్చానని ఆమె చెప్పారు.