హీరో శర్వానంద్ కు శాటిలైట్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. వరుసపెట్టి ఫ్లాపులు ఇవ్వడంతో నాన్-థియేట్రికల్ మార్కెట్ లో డల్ అయ్యాడు ఈ హీరో. ఈ క్రమంలో అతడు నటించిన ఒకే ఒక జీవితం సినిమా సూపర్ హిట్టయినప్పటికీ, శాటిలైట్ మాత్రం చాన్నాళ్ల పాటు అమ్ముడుపోలేదు.
ఎట్టకేలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. జెమినీ ఛానెల్ వీటిని దక్కించుకుంది. త్వరలోనే ప్రసారం కూడా చేయబోతోంది. ఈ మేరకు అగ్రిమెంట్లు అన్నీ పూర్తయ్యాయి.
నిజానికి ఓ హిట్ సినిమాను ఛానళ్లు వదులుకోవు. అయితే, రీసెంట్ గా స్టార్ మా, జీ తెలుగు ఛానళ్లు ఓ నియమం పెట్టుకున్నాయి. శాటిలైట్ తో పాటు డిజిటల్ కూడా అందుబాటులో ఉంటేనే రైట్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఒకే ఒక జీవితం స్ట్రీమింగ్ రైట్స్ ఆల్రెడీ అమ్ముడుపోయాయి. దీంతో శాటిలైట్ పెండింగ్ లో పడింది.
ఎట్టకేలకు జెమినీ టీవీ ముందుకురావడంతో ఈ సినిమా కీలకమైన నాన్-థియేట్రికల్ బిజినెస్ ను పూర్తిచేయగలిగింది. త్వరలోనే శర్వా సినిమా ప్రసారమయ్యే తేదీ బయటకు రానుంది.