ఓలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 1,441 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఓలా ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 26న ఫుణెలో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని కంపెనీ వెల్లడించింది.
దీని కోసం ఓ ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసినట్టు ఓలా తెలిపింది. ముందస్తు చర్యగా నిర్దిష్ట బ్యాచ్‌లోని స్కూటర్ల డయోగ్నసిస్, బండి కండిషన్ లను చెక్ చేస్తున్నట్టు చెప్పింది. అందువల్ల 1,441 వాహనాలను స్వచ్ఛందంగా మార్కెట్ నుంచి వెనక్కి పిలిపిస్తున్నట్టు పేర్కొంది.
ఈ స్కూటర్‌లను తమ సర్వీస్ ఇంజనీర్లు తనిఖీ చేస్తారని వివరించింది. అన్ని బ్యాటరీ, థర్మల్ అలాగే సేఫ్టీ సిస్టమ్‌లలో క్షుణ్ణంగా డయాగ్నసిస్ చేస్తారని చెప్పింది. ‘దీని బ్యాటరీ వ్యవస్థలు యూరోపియన్ స్టాండర్డ్ ఈసీఈ 136కి అనుగుణంగా ఉండటంతో పాటు, భారతదేశం కోసం తాజా ప్రతిపాదిత ప్రమాణం ఏఐఎస్ 156 కోసం దాని బ్యాటరీ వ్యవస్థలను పరీక్షించినట్టు ఓలా తెలిపింది.
ఇటీవల, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైన సంఘటనలు అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో తయారీదారులు తమ వాహనాలను రీకాల్ చేయవలసి వచ్చింది. ఒకినావా ఆటోటెక్ 3,000 యూనిట్లకు పైగా రీకాల్ చేసింది, మరో సంస్థ ప్యూర్ ఈవీ దాదాపు 2,000 యూనిట్లను వెనక్కి పిలిపించింది.