జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ రెండు రోజుల పర్యటనకు గాను శనివారం ఇండియా చేరుకున్నారు. ఆయనకు ప్రధాని మోడీ సాదర స్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి షోల్జ్ గౌరవ వందనం స్వీకరించారు. నూతన టెక్నాలజీలు, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు వంటి వాటితో సహా పలు కీలక రంగాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి షోల్జ్ భారత పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ వార్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిస్థితి తదితరాలపై మోడీ, షోల్జ్ విస్తృతంగా చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. 2021 లో జర్మనీ ఛాన్సలర్ గా ఏంజెలా మార్కెల్ రాజీనామా అనంతరం ఈ పదవిని చేబట్టిన షోల్జ్ ఇండియాకు రావడం ఇదే మొట్టమొదటిసారి.
గత ఏడాది ఇండోనేసియాలోని బాలిలో జీ-20 సమ్మిట్ సందర్భంగా మోడీ, షోల్జ్ ఇద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గత ఏడాదే జీ-7 కూటమి వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు జూన్ 26 న మోడీ జర్మనీని సందర్శించారు.
అంతకుముందు మే 2 న ఆరో ఇండియా-జర్మనీ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ సమావేశానికి హాజరు కావడానికి మోడీ బెర్లిన్ వెళ్ళినప్పుడు కూడా ఉభయుల మధ్య భేటీ జరిగింది. షోల్జ్ తో బాటు జర్మనీకి చెందిన ఉన్నత స్థాయి అధికార బృందం కూడా ఢిల్లీ చేరుకుంది. షోల్జ్ రేపు ఉదయం బెంగుళూరును విజిట్ చేసి సాయంత్రం అక్కడి నుంచే స్వదేశానికి బయల్దేరతారు.