కని, పెంచి, పెద్ద చేసిన బిడ్డలు తల్లితండ్రులను వృద్ధాప్యంలో కాదు పొమ్మంటే…. అత్యంత అమానవీయమైన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. బిడ్డలిద్దరు తల్లితండ్రులకు భోజనం పెట్టకుండా, కనీసం ఉండేందుకు కూడా అంగీకరించ లేదు. దీంతో ఆ వృద్ధ దంపతులు న్యాయపోరాటానికి దిగారు.
వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన పుల్లారెడ్డి గోవిందమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. ఇద్దరు కుమారులు భూమిని, ఇంటిని సమానంగా పంచారు. తల్లిదండ్రులు మాత్రం మూడు అంకనాలు ఇంటిని వారిద్దరు ఉండడానికి ఉంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఇంటిని కూడా పెద్ద కుమారుడు తన ఆధీనంలో ఉంచుకున్నారు. తల్లిదండ్రులు 20 ఏళ్లుగా చిన్న కుమారుడి వద్దే ఉంటున్నారు.
ఇంటిని మరమ్మతులు చేసుకుంటానని మీకు కేటాయించిన మూడు అంకనాలు ఇంటిలోకి వెళ్లాలని చిన్న కుమారుడు కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ ఇంటిని అప్పగించి, వారిని చూసుకునేందుకు పెద్ద కొడుకు ఒప్పుకోలేదు. ఈ విషయంపై కాలనీ పెద్దలు పంచాయతీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. తల్లిదండ్రులకు కేటాయించిన ఇంటిని తనకు ఇస్తేనే తల్లిదండ్రులు రానిస్తానని చిన్న కుమారుడు తెగేసి చెబుతున్నారు. ఇద్దరు కొడుకులు రానివ్వక పోవడంతో దీంతో వృద్ధ దంపతులు ఏమి చేయలేక తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.