పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా చెన్నారెడ్డి పల్లి గ్రామంలో పర్యటించారు. పాదయాత్రగా ముందుకు కదులుతూ గ్రామంలోని సమస్యలను భట్టి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులో గొల్ల పెంటయ్య- లక్ష్మమ్మ దంపతులు భట్టి విక్రమార్కను కలిశారు.
భట్టి విక్రమార్కను తమ గుడిసెలోకి తీసుకు వెళ్లి తమ పరిస్థితి గురించి చెప్పుకుని ఆ దంపతులు కంటతడి పెట్టారు. చుట్టూ పాతిన నాలుగు కర్రలు, వాటికి అడ్డంగా పెట్టిన తడకలు, పైన ప్లాస్టిక్ కవర్ తో కప్పిన కప్పును ఆయనకు చూపించారు. ఇదే తమ ఆస్తి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరఫున ఇల్లు ఇప్పించాలని పదేండ్లుగా ఎమ్మెల్యే, గ్రామ సర్పంచ్ చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయామని చెప్పారు. కానీ ఇప్పటివరకు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని వాపోయారు. ఎండకు ఎండి, వానకు తడిసి చలికి వణుకుతూ, పాములు, తేళ్లతో సహజీవనం చేస్తున్నామని పేర్కొన్నారు.
అత్యంత దయనీయ స్థితిలో బతుకుతున్న తమకు ఎవరూ సాయం చేయడం లేదన్నారు. పిల్లలు బాగా చదువుకున్నా వారికి కొలువులు రాలేదన్నారు. తన తండ్రి వెంకటయ్యకు పింఛన్ కూడా రావడంలేదని మొర పెట్టుకున్నాడు. దీంతో స్పందించిన భట్టి విక్రమార్క…. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ దంపతులకు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.