తెలంగాణా ప్రభుత్వం పాత సెక్రెటేరియట్‌తో పాటే చాలా విషయాలు పాతి పెట్టే ప్రణాళిక అమలు చేస్తోందని అభియోగాలు వస్తున్నాయి. బలం పాత సెక్రెటేరియట్ కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్ అక్కడి నుంచి ఫైళ్లు, ఫర్నిచర్ తరలింపు పద్దతి చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది.
హైదరాబాద్: పాత సచివాలయం నుంచి పాత ఫైళ్ల తరలింపు ప్రక్రియ ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. డీసీఎం వ్యానులో పాత ఫర్నిచర్, ఫైళ్లు, రికార్డులు అడ్డదిడ్డంగా పడేసి తరలించే సీన్ ట్విట్టర్లో ‘పాత ఫైళ్ల అంతిమయాత్ర’గా వైరల్ అయింది.
పాత ఫైళ్లు చాలా కీలకం. మంచి- చెడుకు అవి సాక్ష్యాలు. ఇలా ఎలా పడితే అలా ఫైళ్లను తీసుకువెళ్లే పద్దతి చూస్తే పాత సచివాలయం కూల్చివేత ప్రహసనంలో కొన్ని కీలకమైన పాత ఫైళ్లు సమాధి అవుతాయన్న అనుమానం బలపడుతోంది. వివాదాస్పద ఫిజికల్ ఫైళ్లు ఆనవాలు లేకుండా చేయడానికి ఇదే సరైన అవకాశం. కొందరు చేసిన తప్పిదాలకు పాత ఫైళ్లే సాక్ష్యం. సందట్లో సడేమియా అన్నట్టు అవి ఇక కనిపించవా ? శిథిలమై పోతాయా ? పాత ఫైళ్లు జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో తరలించక పోవడమే ఈ ప్రశ్నలకు తావిస్తోంది.
పాత ఫైళ్లు, రికార్డులు చిత్తు కాగితాల మాదిరిగా వ్యానులో వేసి తరలించడం కుట్రపూరితంగా సాగుతోందని కొందరి అభియోగం. ఇలా తరలించే క్రమంలో ఎన్ని సక్రమంగా చేరతాయి, ఎన్ని మాయం అవుతాయనేది కేసీఆర్ సర్కారుకే ఎరుక.