సీఎం కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని అనంతరం ఆలయ పరిసరాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అంజన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తానని కేసీఆర్ పలు మార్లు ఇప్పటికే తెలిపారు.
కాగా కేసీఆర్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఆయన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఆయన తెలుగు దేశం పార్టీ నేతగా కొనసాగుతున్న కాలంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు క్షేత్రానికి వెళ్లారు. అప్పటికి ఇంకా ఉద్యమ ప్రస్థానం మొదలు పెట్టలేదు. అక్కడ కొండపై కుటుంబ సభ్యులతో కలిసి ఫొటో దిగారు.
నాడు చిన్నపిల్లలైన కవితను, కేటీఆర్ ను వీపుపై ఎక్కించుకుని కాసేపు ఆడించారు. కేసీఆర్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత కొండగట్టుకు వచ్చారు. చివరిసారిగా ఆయన 1998లో కొండగట్టు ఆలయానికి వచ్చారు.
ఈ తర్వాత ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయాల్లో పలుమార్లు జగిత్యాలకు వచ్చినా.. కొండగట్టు ఆలయానికి రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. కొండగట్టుకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.