నిప్పుతో చెలగాటమాడకూడదు. అలాగే వన్యమృగాల జోలికి వెళ్ళకూడదు. పొరపాటున వెళ్ళినా జాగ్రత్తగా వ్యవహరించి అక్కడ నుంచి బైటపడాలి. లేకపోతే ఏ సింహానికో పులికో పులిహోరా అయిపోతాం. చైనా జరిగిన ఓ సంఘటన అలాంటిదే.
ఈ షాకింగ్ సంఘటన పాతదే అయినా , ఆ సంఘటనకు సంబంధించిన వీడియో చూస్తోంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే ఓ పార్కులో మహిళను పులి ఈడ్చుకెళ్లిపోయింది.
చైనా బీజింగ్‌లోని బాదలింగ్ వైల్డ్ లైఫ్ వరల్డ్ యానిమల్ పార్క్(Badaling Wildlife World animal park) లో 2016లో ఈ ఘటన జరిగింది. వీడియోలో ఏముందంటే.. పార్క్‌లో ఓ మహిళ కుటుంబంతో కలిసి సఫారీకి వెళ్లింది.
సఫారీ మధ్యలో కారు దిగిన యువతి.. డ్రైవర్ సీటు వద్దకు వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ పెద్ద పులి.. యువతిని ఒక్కసారిగా నోటితో పట్టుకుని లాక్కెళ్లింది.
ఆమెను రక్షించుకునేందుకు ఆమె తల్లి, భర్త పులి వెంట పరుగులు తీశారు. ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాలతో బయటపడగా.. ఆమె తల్లి మృతి చెందినట్లు తెలుస్తోంది.