ఒలింపిక్స్ మెడల్ అంటే జీవితకాల స్వప్నం. కానీ.. పోలండ్ జావెలిన్ త్రోయర్ మారియా ఇటీవలి ఒలింపిక్స్ లో గెలుచుకున్న రజతాన్ని రూ. 38 లక్షలకు అమ్మేసింది.. ఎందుకో తెలుసా.. ఒక చిన్నారి వైద్యం కోసం.
8 నెలల వయసున్న మలీసా అనే పాప అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న మారియా ఎంతో ఆవేదనకు గురైంది. చిన్నారికి ఎంతో కొంత సాయం చేద్దామని అనుకుంది. కానీ.. తన దగ్గర అంత డబ్బు లేదు. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన పతకాన్ని వేలం పెట్టింది.
వేలంలో పతకాన్ని జాబ్కా అనే వ్యాపార సంస్థ కొనుగోలు చేసింది. అయితే డబ్బును మారియాకు ఇచ్చినా… మెడల్ ను మాత్రం తిరిగి ఇచ్చేసింది. ఆమె వద్దే ఉంచుకోమని చెప్పింది. ఈ వార్త బాగా వైరల్ కావడంతో అటు మారియాను ఇటు జాబ్కా సంస్థను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.