భారత్ జోడో యాత్ర ఈ రోజు కశ్మీర్‌లోకి ప్రవేశించింది. యాత్ర రామ్ బన్ జిల్లాలోని బనిహాల్‌లో యాత్ర కొనసాగుతోంది. యాత్రలో ఈ రోజు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఆయన సుమారు 2 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
వారి వెంట ఇరు పార్టీల నేతలు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరువురు నేతలు కలిసి రైల్వే స్టేషన్ నుంచి ట్రక్కు యార్డుకు చేరుకున్నారు. యార్టులో పలు అంశాలపై అబ్దుల్లాతో రాహుల్ గాంధీ చర్చించారు. అనంతరం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.
కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ కశ్మీర్ కు వచ్చారని చెప్పారు. అందుకే ఆయనకు స్వాగతం పలికేందుకు తాము వచ్చామని పేర్కొన్నారు. కాషాయ నేతలు పిరికిపందలంటూ ఆయన మండిపడ్డారు. 2014 తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదన్నారు.
ఉగ్రవాదరం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా ఇలా జరగలేదని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ వైఖరి గురించి తెలుసుకోవాలని తాను అనుకోవడం లేదన్నారు. భారత్ జోడో యాత్ర అనేది రాహుల్ ఇమేజ్ పెంచేందుకు ఉద్దేశించినది కాదన్నారు.
దేశంలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఈ యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారని చెప్పారు. కాబట్టే తాను భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నానని వెల్లడించారు. తాము దేశ ప్రతిష్ట కోసమే యాత్రలో పాల్గొంటున్నామని, అంతే కానీ వ్యక్తిగత కీర్తి కోసం కాదన్నారు.