జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కఠిన మైన పబ్లిక్ సేప్టీ యాక్ట్ కింద నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సరా అబ్దుల్లా పైలట్ సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడిని వెంటనే నిర్బంధం నుంచి విడుదల చేయాలని పిటిషన్ లో కోరారు. తన సోదరుడని నిర్బంధించడం రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లఘించడమేనని సరా అబ్దుల్లా అన్నారు. రాజకీయ శతృవులను కండ బలంతో అణిచవేయడమని ఆరోపించారు.
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను గృహ నిర్బంధం గావించారు. వారి నిర్బంధం ఆరు నెలలు పూర్తవుతున్న సమయంలో వారిపైన పబ్లిక్ సేప్టీ యాక్ట్ ప్రయోగించి నిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. ఈ యాక్ట్ కింద నిర్బంధాన్ని ఎన్ని సార్లయినా పొడిగించుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రులపై కఠినమైన ఈ చట్టాన్ని ప్రయోగించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, స్మగ్లర్లు, రాళ్లు రువ్వే వారు, పబ్లిక్ ఆర్డర్ ను ధిక్కరించే వారిపై ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాజకీయ నాయకులపై కూడా ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.
రాజకీయ నాయకులపై ఇలాంటి చట్టాన్ని ప్రయోగించడం భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య రాజకీయాలకు తగదని సరా అబ్దుల్లా అన్నారు. ఒమర్ అబ్దుల్లాను ఎందుకు నిర్బంధిస్తున్నారో ఇప్పటి వరకు ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదని తెలిపారు. 49 ఏళ్ల నేషనల్ కాన్ఫరెన్స్ నేతపై మోపిన అభియోగాలు చూస్టుంటే ఆశ్యర్యం, ఆగ్రహం కలుగుతుందని సరా అబ్దుల్లా అన్నారు.