ఒమిక్రాన్ బాధితులకు మల్టీ విటమిన్స్, పారాసిటమాల్ టాబ్లెట్స్ తోనే చికిత్స అందిస్తున్నామని ఢిల్లీలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ తెలిపారు. అక్కడ 40 మంది ఒమిక్రాన్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. వారందరికీ ఇదే మెడిసిన్ ఇస్తున్నామని అన్నారు. మొత్తం 40 మందిలో 19 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇంత కంటే ఎక్కువ మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తను భావించడం లేదని సీనియర్ డాక్టర్ చెప్పారు.
ఒమిక్రాన్ సోకుతున్న వారిలో 90శాతం ఎలాంటి లక్షణాలు లేవని.. మిగిలిన వారిలో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. గొంతు మంట, జ్వరం, దురదలు లాంటివి కనిపిస్తున్నాయని అన్నారు. అటు, కోవిడ్ తీవ్రత గురించి కూడా మాట్లాడిన ఆయన.. విదేశాల నుంచి వచ్చి కరోనా బారినపడుతున్న వారిలో అందరూ రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారే అని తెలిపారు. కొందరు బూస్టర్ డోసులు కూడా పూర్తి చేసుకున్నారని అన్నారు.
ఇప్పటి వరకు ఢిల్లీలో 67 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23మంది కోలుకున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా ఈ మహమ్మారి ఎటాక్ చేస్తుందని.. దీంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు. ఒమిక్రాన్ వ్యాప్తిని ముందుగానే ఊహించి వైద్య సదుపాయాలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. రోజుకి 3 లక్షల పరీక్షలు నిర్వహించి.. లక్ష మందికి చికిత్స అందించేందుకు ఆరోగ్య కార్యకర్తలు, బెడ్లు, ఆక్సిజన్ ఏర్పాట్లు చేశామని కేజ్రీవాల్ అన్నారు.