పరాఠాలపై కూడా 18 శాతం జీఎస్టీ విధించడం మరీ దారుణం అన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. వీటిమీద ఇంత పన్ను విధింపు సరైనదేనని గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఇటీవల అడ్వాన్స్ రూలింగ్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పైగా మామూలు చపాతీ లేదా రోటీ కన్నా పరాఠాలు భిన్నమని, అందువల్ల అన్ని రకాల పరాఠాల మీదా 18 శాతం జీఎస్టీ సమంజసమేనని కూడా ఈ అథారిటీ పేర్కొందన్నారు.
కానీ ఒకప్పుడు బ్రిటిష్ వారు కూడా ఫుడ్ ఐటమ్స్ పై ఇలా పన్ను విధించలేదని కేజ్రీవాల్ అన్నారు. కేంద్రం విధించిన అత్యధిక జీఎస్టీ కారణంగానే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోందన్నారు. దీన్ని తగ్గించాలని, ప్రజలకు దీని భారం నుంచి విముక్తి కల్పించాలని ఆయన కోరారు.
గుజరాత్ లో ఇప్పుడు .. పరాఠాల పై జీఎస్టీ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది. ప్యాకేజ్ చేసిన ఈ ఫుడ్ ఐటెం మీద ఇంత శాతం జీఎస్టీ విధించడాన్ని సవాలు చేస్తూ ఓ ఫుడ్ కంపెనీ గత నెలలో గుజరాత్ అప్పిలేట్ అథారిటీలో అప్పీల్ దాఖలు చేసింది. రాష్ట్ర అధికారులు కూడా పన్నును సమర్థించడంతో ఈ సమస్య దాదాపు వివాదంగా మారింది. పిజ్జా, బ్రెడ్, రస్కులు వంటివాటిపై 5 శాతం జీఎస్టీ ఉండగా ప్యాకేజ్ చేసిన పరాఠాల మీద ఇంత శాతం పన్ను ఏమిటని ఈ కంపెనీ ప్రశ్నించింది. రాష్ట్ర ఎన్నికల ముందు ఈ వివాదం బీజేపీ, ఆప్ మధ్య పెద్ద ఇష్యుగానే మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.