ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 27 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి ఆందోళనకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్ని ప్రమాద సమయంలో ప్రజలు భయంతో తాడు సహాయంతో గోడలపై నుంచి కిందకు జారుతున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.
మరికొందరైతే ప్రాణభయంతో ఏకంగా ఆ భవనం నుంచి మరో భవనంలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో భవనం వెలుపల ఉన్న వారు ఈ దృశ్యాలు చూస్తూ షాక్ అయ్యారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆర్ధరాత్రి సమయంలో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చింది.