రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా వద్ద ఘర్షణ జరిగింది. దర్గా వద్ద రెండు గ్రూపులు ఘర్షణ పడ్డాయి. సూఫీ సంత్ ఖ్వాజా మొయినొద్దీన్ చిస్తీ ఉర్సు వేడుకల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగినట్టు తెలుస్తోంది. దర్గా వద్ద ఉర్సుకు హాజరయ్యేందుకు బరేల్వీ వర్గానికి చెందిన బృందం బరేల్వీ వర్గానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
దర్గాను చూసుకుంటున్న ఖాదిమ్ వర్గ ప్రజలు ఈ నినాదాలతో ఆగ్రహానికి గురయ్యారు. నినాదాలు చేయొద్దంటూ బరేల్వి వర్గానికి సూచించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలకు చెందిన అనేక మంది ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు సమాచారం.
దర్గా నిర్వాహకులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను వారించే ప్రయత్నం చేశారు. కానీ వారి మాటలను రెండు గ్రూపులు పట్టించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. బరేల్వీ వర్గానికి చెందిన వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఘర్షణ సద్దుమణిగినట్టు సమాచారం. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయనట్టు తెలుస్తోంది. ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.