కేరళలోని తన అకాడమీకి ఆక్రమణదారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని లెజెండరీ మాజీ అథ్లెట్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష అన్నారు. తన అకాడమీలో ఆక్రమణదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆమె వాపోయారు.
అకాడమీలోకి ఆక్రమణదారులు, దౌర్జన్యాలు చేసే వారు ప్రవేశిస్తున్నారని ఆమె అన్నారు. దీంతో అకాడమీలోని అథ్లెట్ల భద్రతపై ఆందోళన కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…
అకాడమీలోని సమస్యలను వివరిస్తూ ఆమె కంటతడి పెట్టారు. తన అకాడమీలోని అథ్లెట్లకు ఇటీవల బయటి వ్యక్తుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని, వారి భద్రతపై ఆందోళన కలుగుతోందన్నారు. తాను రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అవి మరింత ఎక్కువయ్యాయని చెప్పారు.
అకాడమీ చుట్టూ కాంపౌండ్ నిర్మించేందుకు తమకు పంచాయతీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో చుట్టు పక్కల చెత్త అంతా తీసుకు వచ్చి అకాడమీలో వేస్తున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు అకాడమీలోకి రాత్ర సమయంలో చొరబడుతున్నారని వాపోయారు.
దీంతో మహిళా అథ్లెట్ల భద్రతపై ఆందోళన నెలకొందన్నారు. ఈ విషయంలో కేరళ సీఎం పినరయి విజయన్ కు ఇప్పటికే తాను ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. జోక్యం చేసుకోవాలన్నారు. అకాడమీలో ఆక్రమణలను ఆపేలా, అథ్లెట్లకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.