మనీలాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్ర శేఖర్ ఢిల్లీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ రోజు ఆయన జైలు గదిని అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆయన జైలు గదిలో విలాసవంతమైన వస్తువులు లభించాయి. వాటిని చూసి జైలు అధికారులు ఆశ్చర్య పోయారు.
ఈ ఘటనకు చెందిన జైలు గది సీసీటీవీ విజువల్స్ బయటకు వచ్చాయి. జైలర్ దీపక్ శర్మతో పాటు ఇతర అధికారులు సుఖేశ్ చంద్రశేఖర్ జైలు గదిలోకి వెళ్లారు. అక్కడ 1.5 లక్షల విలువైన గుక్కి సాండల్‌ను అధికారులు గుర్తించారు. వాటితో పాటు రూ. 80 వేల ఖరీదైన రెండు జతల జీన్స్ వారికి కనిపించాయి.
జైలర్ ఆ గదిలోకి వచ్చిన సమయంలో సుకేశ్ బోరున ఏడ్చేశాడు. ఆ గదిలో ఓ మూలన నిలుచుని సుఖేశ్ కన్నీరుపెట్టుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పడు వైరల్ అవుతున్నాయి.
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేశ్‌ను అరెస్టు చేశారు. సుఖేశ్ నుంచి ఖరీదైన బహుమతులు పొందారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహ్‌లను కూడా పోలీసులు ప్రశ్నించారు.మరోవైపు సుఖేశ్ జైలు గది విజువల్స్ లీక్ కావడంపై అధికారులు సీరియస్ అయ్యారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.