సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఏడాదికి పైగా రైతులు ఉద్యమం సాగించారు. ఈ క్రమంలో ఎంతోమంది మరణించారు. వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే తమ దగ్గర మరణించిన వారి సమాచారం లేదని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మోడీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రైతుల మరణాలతో పంజాబ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకున్నా 403 మంది కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించిందని.. 152 మందికి ఉద్యోగాలు కల్పించిందని అన్నారు రాహుల్. ఇతర రాష్ట్రాల నుంచి 100 మంది, ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు 200 మంది పేర్లతో తయారు చేసిన జాబితా ఉందని తెలిపారు. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేదని చెప్పడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.
చనిపోయిన రైతుల వివరాలను సోమవారం పార్లమెంట్‌లో సమర్పిస్తామన్నారు రాహుల్ గాంధీ. కేంద్రం తప్పు వల్ల 700 మంది చనిపోయారని.. ఇప్పుడు వారి వివరాలపై అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.