హనుమాన్ చాలీసా వివాదం విషయంలో బీజేపీపై శివసేన విరుచుకు పడింది. హిందుత్వ అనేది సంస్కృతి అని, గందరగోళం కాదని అని శివసేన తెలిపింది. ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, నవనీత్ కౌర్ దంపతులకు మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. దీంతో బీజేపీపై శివసేన మండిపడింది.
‘ప్రస్తుతం హిందుత్వ పేరుతో బీజేపీ ప్రారంభించిన రచ్చను సమర్థించలేం. హిందుత్వ ఒక సంస్కృతి. అంతేకానీ గందరగోళం కాదు. రానా దంపతులు అమరావతికి చెందిన శాసనసభ్యులు. ఏ పార్టీ జెండా ఎగురవేస్తారో చెప్పలేం’’ అని శివసేన పేర్కొంది.
‘ ఆమె రాముడి పేరుతో ప్రమాణం చేయడానికి నిరాకరించింది. కానీ మాతోశ్రీ(ఉద్ధవ్ థాక్రే నివాసం) వద్ద హనుమాన్ చాలీసాను పఠించాలని కోరుకుంటోంది. బీజేపీ నాయకులు ఆమెకు ఇప్పుడు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని తెలిపింది.
ముంబై పోలీసులపై కౌర్ దంపతులు విమర్శలు చేయడంపై శివసేన ఘాటుగా స్పందించింది. ‘ రానా తప్పుడు కుల ధృవీకరణ పత్రానికి వ్యతిరేకంగా ముంబై పోలీసులు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు వివరణాత్మక నివేదికను పంపారు. కాబట్టి రానా దంపతులు ముంబై పోలీసులపై దుమ్మెత్తిపోయడం సహజం’ అని పేర్కొంది.