దేశవ్యాప్తంగా ఒకవైపు సంచలనాలు, మరోవైపు వివాదాలు, ప్రశంసలతో నడిచిన వివేక్ అగ్నిహోత్రి సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’ ఇప్పటికీ కొందరు ప్రముఖులకు ‘అంతుబట్టనిదిగానే’ ఉంది. ఇది ప్రచారానికి మాత్రమే పనికి వచ్చే చిత్రమని, ‘వల్గర్’ గా ఉందని ఇజ్రాయెల్ దౌత్యాధికారి, క్రీన్ రైటర్, ఫిల్మ్ మేకర్ కూడా అయినా నాదవ్ లాపిడ్ పెదవి విరిచారు. ప్రతిష్టాత్మకమైన చలన చిత్రోత్సవాల్లో ఇలాంటి సినిమాను ప్రదర్శిస్తుండడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
కళాత్మక, కాంపిటీటివ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇలాంటి మూవీని ప్రదర్శించడంతో తనతో బాటు అనేకమంది షాక్ తిన్నారని, దీన్ని ఎంపిక చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. నా ఈ ఫీలింగ్ ని బాహాటంగానే అందరితో పంచుకుంటున్నానని, దీనిపై విమర్శనాత్మక చర్చ జరగడం ఎంతైనా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇఫి’ (భారతీయ చలన చిత్రోత్సవాల) పనోరమా సెక్షన్ లో ఈ చిత్రాన్ని ఈ నెల 22 న ప్రదర్శించారు.
అయితే ఇజ్రాయెల్ కే చెందిన కాన్సల్ జనరల్ కొబ్బి షొషానీ .. ఆయన వ్యాఖ్యలతో విభేదించారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తాను చూశానని, మీ కామెంట్స్ అంగీకారయోగ్యం కాదని ఆయన అన్నారు. ఈ సినిమాలో నటించిన వారిని నేను కలుసుకున్నాను.. వారి అభిప్రాయాలు తెలుసుకున్నాను .. ఇందులో వల్గారిటీ ఏమీ లేదని అభిప్రాయపడుతున్నా.. అని ఆయన చెప్పారు.
ఈ మూవీ మేకర్స్ వాస్తవాలను ధైర్యంగా చూపారని, తాము ఆలోచించిన దాన్ని ఇందులో ప్రదర్శించారని ఆయన చెప్పారు. వారికి దమ్ము ఉందని ఆయన ప్రశంసించారు. అయితే కొంతమంది వాస్తవాలను అంగీకరించడానికి ఇష్టపడరని, అలాగే ప్రపంచం కూడా దీన్ని చూడరాదని వారు కోరుతుంటారని కొబ్బి షొ షానీ ఘాటుగా వ్యాఖ్యానించారు.