శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే కౌంటర్ ఇచ్చారు. మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న తన డిమాండ్ వెనక ఉద్దేశం ముస్లింల ప్రార్థనలను వ్యతిరేకించడం కాదని ఆయన ఆదివారం అన్నారు.
రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగాలని తాను కోరుకోవడం లేదన్నారు. కానీ వాళ్లు లౌడ్‌స్పీకర్ పై చేస్తే తాము కూడా లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తామన్నారు. చట్టం కన్నా మతం పెద్దది కాదని ముస్లింలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. మే2 లోగా లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే ఏమి చేయాలో ఆ తర్వాత చూస్తాను అని అన్నారు.
అంతకు ముందు మహారాష్ట్రలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరిగాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అయితే ఇక్కడ ప్రజలు, పోలీసులు శాంతియుతంగా ఉన్నారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో కొత్త ఓవైసీ, హిందూ ఓవైసీ(రాజ్ థాక్రేను ఉద్దేశించి) ద్వారా రాముడు, హనుమంతుని పేరుతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి ప్రయత్నాలను సాగనీయబోమని తెలిపారు.