రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినా రాజకీయంగా దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉండదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. అలాగే రాహుల్ నిర్వహించిన భారత్ జోడో యాత్ర కూడా ఆ పార్టీకి ఉపకరించదన్నారు. ఆ యాత్ర జరిగిన తరువాత నిర్వహించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవి చూసిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సమాజం ఆటోమేటిగ్గా మీకు అండగా నిలబడుతుందని భావించవద్దు అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
బీహార్ లో జన సురాజ్ యాత్ర చేస్తున్న పీకే.. రానున్న 2024 ఎన్నికల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ విజయం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమవుతుందని అన్నారు. ‘రాహుల్ గాంధీ ఇప్పటికీ కొన్ని అంశాలను గుర్తించడం లేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును ప్రాంతీయ పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్, ఆప్, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, బహుజన్ సమాజ్ వంటి ప్రాంతీయ పార్టీలు సమానంగా తలదన్నుకు పోయాయి. ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయాలనుకుంటే కేవలం బీజేపీతోనే కాదు.. ప్రాంతీయ పార్టీల తోనూ పోరాడవలసి ఉంటుంది’ అని ఆయన విశ్లేషించారు.
క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి తాను లోగడ కొన్ని సూచనలు చేశానని, కానీ నేననుకున్నట్టు ఆ పార్టీ వ్యవహరించలేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. 1989 నుంచి ఆ పార్టీ బలం తగ్గుతూ వచ్చిందని, చివరిసారి అది 1984 లో గెలిచిందని చెప్పిన ఆయన.. ప్రజలకు తమ భావాలను వివరించే తీరులో కూడా సంస్కరణలు రావాలని సూచించారు.
ఓ పరువునష్టం కేసులో రాహుల్ కి విధించిన రెండేళ్ల జైలు శిక్ష చాలా ఎక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన దివంగత మాజీ ప్రధాని ఏబీ. వాజ్ పేయి వ్యాఖ్యలను గుర్తు చేశారు. రాహుల్ అనర్హత సమస్యపై బీజేపీ ‘పెద్ద మనసు’తో వ్యవహరించాలన్నారు. చిన్న మనసుతో ఎవరూ గొప్పవారు కాలేరని నాడు వాజ్ పేయి హితవు చెప్పారన్నారు. బీజేపీ కొన్ని రోజులు సహనంతో ఉంటే బాగుండేదని, కాంగ్రెస్ అప్పీలు చేసుకునేంతవరకు వేచి ఉండాల్సిందని పీకే పేర్కొన్నారు.