మహిళపై ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలను పలు పార్టీల నేతలు ఖండిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
తాజాగా ఆయన వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. 2011లో మహిళ వేషంలో రాం లీలా మైదానంలో నుంచి రాం దేవ్ బాబా ఎందుకు పారిపోయారో తనకు ఇప్పడు అర్థం అయిందన్నారు. ఆయన తనకు శారీలు, సల్వార్ లు ఇష్టమంటూ చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు మహిళలపై రాందేవ్ బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను యోగా గురు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య సమక్షంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆమె తెలిపారు. యోగా గురువు రాం దేవ్ బాబా వ్యాఖ్యలు మహిళా లోకాన్ని బాధించిందన్నారు. తప్పుడు వ్యాఖ్యలకు గాను ఆయన దేశ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని ఆమె ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలోని థానేలో ఓ యోగా శిబిరంలో రాందేవ బాబా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు చీరకట్టులో, సల్వార్ సూట్స్‌లో అందంగా ఉంటారని అన్నారు. వారు ఏం ధరించకపోయినా బాగుంటారని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.