ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ మాత్రం ఖరారైంది. ఫిబ్రవరి 11న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఆయన పాల్గొననున్నారు. ఆదిలాబాద్,పెద్దపల్లి,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిసింది.
కాగా ఈనెల 13న ప్రధాని మోడీ పర్యటన మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. ఈ నెలఖారున జేపీ నడ్డా కూడా తెలంగాణకు రానున్నారు. దీంతో తెలంగాణలో ఇద్దరు అగ్రనేతలు పర్యటించనున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ నేతలు తెలంగాణలో పదేపదే పర్యటిస్తుండడం.. మరో వైపు ముందస్తుకు సిద్దమంటూ ఇటు బండి సంజయ్ అంటు కేటీఆర్ సవాళ్ల విసురుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో అమిత్ షా టూర్ చర్చనీయాంశంగా మారింది. ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ స్వయంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు జరిగే వరకూ ప్రతి నెల ఇద్దరి పర్యటనలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.
మరో వైపు అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తం అవ్వడంలో భాగంగా తెలంగాణ బీజేపీ కొత్త కార్యాచరణ సిద్దం చేస్తూ ఇప్పటికే బూత్ స్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి దాకా పార్టీ అధినాయకత్వం వరుస సమావేశాలు నిర్వహించింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో అమలు చేసిన ఫార్ములానే ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది. దీనికి కోసం ప్రతి 15 రోజులకు తెలంగాణ కేంద్రంగా జరిగే సభలకు ప్రధాని మోడీ ఆయనకు కుదరక పోతే పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా లేదా అమిత్ షా హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.